Tuesday, November 2, 2010

బ్రెజిల్‌ అధ్యక్షురాలు దిల్మా రౌస్సెఫ్‌

6 శాతం ఓట్లతో విజయం
బ్రెజిల్‌లో 2010 అక్టోబర్‌ 31 జరిగిన రెండవ విడత అధ్యక్ష ఎన్నికల్లో పాలకపక్ష అభ్యర్థి దిల్మా రౌస్సెఫ్‌ దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైనట్లు అధికారిక ఫలితాలు తెలిపాయి. ఆమె మహిళా ఆర్థికవేత్త. బ్రెజిల్‌ సైనిక నిరంకుశత్వ పాలనా కాలంలో ఒకసారి ఆమె గెరిల్లాగా కూడా శిక్షణ పొందారు. మొత్తం లెక్కింపు పూర్తయిన అనంతరం చెల్లుబాటైన ఓట్లలో ఆమెకు 56 శాతం లభించాయి. ఆమె ప్రత్యర్థి, సోషల్‌ డెమోక్రాట్‌ అభ్యర్థి జోస్‌ సెర్రాకు 44 శాతం ఓట్లు పోలయ్యాయి. అక్టోబర్‌ 31న సాయంత్రం ఆయన తన ఓటమిని అంగీకరించారు. వర్కర్స్‌ పార్టీ అభ్యర్థిగా ఆమెను ప్రస్తుత అధ్యక్షుడు లూలా నామినేట్‌ చేశారు. దీంతో లూలా విధానాల కొనసాగింపుకు వీలు ఏర్పడింది. 'ఆయన స్థానాన్ని ఆక్రమించడమనే లక్ష్యం చాలా కష్టమైనది, సవాలుతో కూడుకున్నది. అయితే ఆయన వారసత్వాన్ని ఎలా గౌరవించాలో నాకు తెలుసు. ఆయన కృషిని, నిర్మాణాన్ని ఎలా పటిష్టపరచాలో కూడా తెలుసు' అని అధ్యక్షురాలిగా ఎన్నికైన అనంతరం చేసిన తొలి ప్రసంగంలో రౌస్సెఫ్‌ ఆనందబాష్పాల మధ్య చెప్పారు. ఫలితాల తుది ధ్రువీకరణ అనంతరం వచ్చే జనవరి 1న ఆమె నాలుగు సంవత్సరాల కాలానికి అధ్యక్ష పదవిని చేపడతారు. వర్కర్స్‌ పార్టీకి పార్లమెంటు ఉభయసభల్లోనూ మెజారిటీ ఉంది. పేదరికాన్ని నిర్మూలించడం, అందరికీ సమాన అవకాశాలు సృష్టించడమనేవి తన ప్రాథమిక వాగ్దానమని ఆమె చెప్పారు. ఆర్థికాభివృద్ధిని, ధనిక దేశాల రక్షణాత్మక విధానాలపై పోరును, ఆర్థిక స్పెక్యులేషన్‌ను అంతంచేయాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. తొలి విడత ఎన్నికల్లో ఆమెకు 47 శాతం ఓట్లు లభించాయి. అయితే అవసరమైన 50 శాతానికి పైగా ఓట్ల కోసం రెండవ విడత ఎన్నికలు జరిపారు. 13.6 కోట్ల మంది ఓటర్లు రిజిష్టరు కాగా 21 శాతం మంది పోలింగ్‌లో పాల్గొన లేదు. కాగా బ్రెజిల్‌లో వయోజనులు ఓటు వేయడం తప్పనిసరి. పోలింగ్‌ కేంద్రాలను ఉదయం పది గంటలకు తెరిచారు. తొమ్మిది గంటల అనంతరం పోలింగ్‌ ముగిసింది. అయితే కొన్ని అమెజాన్‌ రాష్ట్రాల్లో మాత్రం రాత్రి 9 గంటల వరకూ పోలింగ్‌ జరిగింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను ఉపయోగించినందున ఓట్ల లెక్కింపు వేగంగా జరిగింది. ఎన్నికలు మొత్తం మీద ప్రశాంతంగా జరిగినట్లు అత్యున్నత ఎన్నికల ట్రిబ్యునల్‌ తెలిపింది. ఆమె దేశానికి గొప్ప ప్రభుత్వాన్ని అందిస్తారనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని లూలా తన స్వస్థలం సావో బెర్నార్డో దూ క్యాంప్‌లో ఓటు వేసిన అనంతరం చెప్పారు. లూలాకు ప్రజల్లో 80 శాతం రేటింగ్‌ ఉంది. అయితే రౌస్సెఫ్‌ ప్రభుత్వంలో తాను ప్రత్యక్షంగా జోక్యం చేసుకోబోనని లూలా చెప్పారు.
బ్రెజిల్‌ గురించి
బ్రెజిల్‌ అధికార నామం ఫెడరిక్‌ రిపబ్లిక్‌ ఆప్‌ బ్రెజిల్‌ దక్షణ అమెరికాలో ఒక దేశమిది. వైశాల్య రిత్యా ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద దేశం బ్రెజిల్‌. నాల్గవ అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంగా ఉంది. తూర్పున అట్లాంటిక్‌ మహాసముద్రం ఉన్న బ్రెజిల్‌ సముద్రతీరం పొడవు 7.491 కిలోమీటర్లపై బడి ఉంది. 1500 సంవ్సతరం నుంచి 1822లో స్వాతంత్య్రం పొందే వరకు బ్రెజిల్‌ పోర్చుగల్‌ పరిపాలనలో ఉంది. బ్రెజిల్‌ ఐక్యరాజ్య సమితి స్థాపన దేశాలలో ఒకటి.

1 comment:

  1. మీకు, మీ కుటుంబసభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు.

    ReplyDelete